పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు చేరడంతో అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయని, కొన్ని దేశాల్లో ఇంధన సరఫరా కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, భారత్‌లో ఒక్కరోజు కూడా ఇంధన కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు. దిగుమతి మార్గాల్లో ఇబ్బందులు ఎదురైనా దేశంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగిందని తెలిపారు.
ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం తగ్గించేలా ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుందని ప్రధాని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధన నిర్వహణ చేపట్టామని, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూ అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.