ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్లాట్‌ఫామ్‌లో అక్రమంగా ఓటీటీ ఒరిజినల్ కంటెంట్, థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు, ఇతర పైరసీ వీడియోలు విస్తృతంగా అందుబాటులో ఉండటంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ కార్యకలాపాల వల్ల సినీ, ఓటీటీ పరిశ్రమలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
టెలిగ్రామ్‌లో డిజిటల్ పైరసీని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే ప్లాట్‌ఫామ్‌లో ఉన్న పైరసీ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని సూచించింది. అక్రమ లింకులను అడ్డుకునేందుకు అమలు చేస్తున్న విధానాలపై కూడా వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
దేశీయ సినీ పరిశ్రమ, ఓటీటీ సంస్థల మేధో సంపత్తి హక్కులను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా టెలిగ్రామ్ స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.