ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌పై కేంద్రం సీరియస్.. మెటాకు కేంద్ర ప్రభుత్వం షాక్.. !

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న ప్రకటనలు, సైబర్ మోసాల ముప్పుపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై వివరణ కోరుతూ మెటాకు నోటీసులు జారీ చేయాలని ఐటీ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఒకే వారంలో మెటా సంస్థకు కేంద్రం నోటీసులు ఇవ్వడం ఇది రెండోసారి అవుతుంది. వాట్సాప్‌లోని ‘యూజర్ నేమ్’ ఫీచర్‌కు సంబంధించి కేంద్రం ఇప్పటికే బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న కొన్ని పెయిడ్ ప్రకటనలు, వినియోగదారులను టెలిగ్రామ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ నెట్‌వర్క్‌ల వైపు మళ్లిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని కేంద్ర మంత్రి తీవ్రంగా పరిగణించారు. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించే విధంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల విషయంలో మెటా నుంచి వివరణ కోరాలను అధికారులకు ఆదేశాలు అందాయి.

 

ఇటీవలి కాలంలో మెటా కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ ప్రతిపాదించిన ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, గుర్తింపు చౌర్యం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ మెటాకు ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు పంపింది.