రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్‌తో కలిసి ఆయన కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టును రెండు దశల్లో మొత్తం రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్నారు. తొలిదశ పూర్తయ్యేసరికి ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఈ స్టీల్ ప్లాంట్‌తో పాటు, దీనికి అనుబంధంగా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇదే కాకుండా, రాష్ట్రంలో 3,850 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు మరో రూ.20,350 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ముందుకొచ్చింది.
వర్చువల్‌గా విజయనగరం పార్కు ప్రారంభం
ఈ కార్యక్రమం నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కును వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.531 కోట్ల పెట్టుబడితో 1166 ఎకరాల్లో ఈ పార్కును అత్యాధునిక వసతులతో, ప్లగ్ అండ్ ప్లే విధానంలో అభివృద్ధి చేశారు.
ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో సీఎం ఆసక్తి..
అంతకుముందు, స్టీల్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ మినియేచర్ మోడల్, నియో ఎనర్జీ ప్లాంట్ వివరాలను సజ్జన్ జిందాల్ ఆయనకు వివరించారు. హైదరాబాద్‌లో జేఎస్‌డబ్ల్యూ తయారుచేస్తున్న డిఫెన్స్ డ్రోన్ షీల్డ్ ఏఐ టెక్నాలజీ గురించి సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రక్షణ, పౌర అవసరాలకు డ్రోన్ల తయారీపై దృష్టి సారించాలని, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలోని వసతులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విపత్తుల సమయంలో వినియోగించే ప్రత్యేక వాహనాలను కూడా ఆయన పరిశీలించారు.