రాయలసీమ యాక్షన్‌తో అఖిల్ ‘లెనిన్’..! అఖిల్ కొత్త అవతారం..!

అక్కినేని యువ హీరో అఖిల్ తన కొత్త సినిమా ‘లెనిన్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. పూర్తిస్థాయి రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. రాయలసీమ నేపథ్యంతో కూడిన కథాంశంతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ రక్తికట్టించింది.

 

‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అక్కినేని నాగార్జున, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

 

విడుదలైన ట్రైలర్‌ను బట్టి ఇందులో మాస్ అంశాలతో పాటు బలమైన ప్రేమకథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్, రొమాన్స్ సమపాళ్లలో మేళవించి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతోంది. ‘లెనిన్’ చిత్రాన్ని జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో మంచి విజయం సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.