బంధువుల వివాహ వేడుకకు ఎంతో సంతోషంగా బయల్దేరిన ఆ కుటుంబంలో ఊహించని రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తిరుపతి జిల్లా (ఉమ్మడి చిత్తూరు) పాకాల మండలం గాదంకి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లికి చెందిన 11 మంది ఒక ఆటోలో తిరుపతిలో జరిగే పెళ్లికి బయల్దేరగా మార్గమధ్యంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదానికి చెక్‌పోస్టు వద్ద మోగిన ఒక చిన్న ‘విజిల్’ కారణం కావడం గమనార్హం. బెంగళూరు నుంచి కలప లోడుతో వెళ్తున్న ఒక లారీ అటవీ శాఖ చెక్‌పోస్టు వద్దకు రాగానే, విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ కోసం అకస్మాత్తుగా విజిల్ ఊదారు. దీంతో కంగారు పడిన లారీ డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో లారీ వెనుక వేగంగా వస్తున్న ఆటో అదుపుతప్పి, నేరుగా లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఆటో డ్రైవర్‌కు వాహనాన్ని నియంత్రించే సమయం కూడా దొరక్కపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ భయానక ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న యనమల మాధవి (37), ఆమె కుమార్తె మేఘన (15) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన మాధవి సోదరుడు పులికంటి రాజశేఖర్ (25) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోగా, మాధవి తల్లి పులికంటి బేబీ (50) రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురికి ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.