దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాను భారీ భూకంపాలు కుదిపేశాయి. రాజధాని కారకస్‌కు సమీపంలో బుధవారం రాత్రి అతి తక్కువ వ్యవధిలో 7.2, ఆ వెంటనే 7.5 తీవ్రతలతో వరుసగా రెండు బలమైన భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి పలు భవనాలు పేకమేడల్లా కుప్పకూలగా, కరెంటు సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అంధకారం అలుముకుంది. జాతీయ సెలవు దినం కావడంతో ఎక్కువ మంది ఇళ్లలోనే ఉన్న సమయంలో ఈ విపత్తు ముంచుకొచ్చింది. దీంతో ప్రాణభయంతో ప్రజలు హాహాకారాలు చేస్తూ ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు.
ఈ ఘోర విపత్తులో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి భవనాల నిర్మాణాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్యను బట్టి చూస్తే.. మృతుల సంఖ్య 10,000 నుంచి లక్ష వరకు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన వెనిజులా ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించింది. విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో వెనిజులాకు అండగా నిలిచేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది. భారీ ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన భారత్, అమెరికా తదితర దేశాలు బాధిత దేశానికి తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అయితే నిరంతరంగా వస్తున్న ప్రకంపనలు (ఆఫ్టర్ షాక్స్), దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ అంతరాయం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రాణనష్టానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.