పూణె లోహగఢ్ మృతి కేసులో సంచలనం: కాబోయే భర్తను చంపేందుకు వధువు వేసిన మూడు స్కెచ్‌లు ఇవే!

మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న లోహగఢ్ కోట వద్ద ఇటీవల చోటుచేసుకున్న యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ (26) మృతి కేసులో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫొటోలు తీస్తూ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోయలో పడి కేతన్ మరణించాడని తొలుత అందరూ భావించారు. కానీ, ఇది ప్రమాదం కాదని, అతనికి కాబోయే భార్య సియా గోయల్ (20), తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పక్కా ప్రణాళికతో చేసిన దారుణ హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో దాదాపు రూ. 17 కోట్ల ఖర్చుతో వీరికి ఘనంగా వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని సియా, తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

తన ప్రియుడితో ఉన్న సంబంధానికి కేతన్ అడ్డుగా ఉన్నాడని భావించిన సియా.. అతన్ని అంతమొందించేందుకు ఏకంగా మూడుసార్లు స్కెచ్ వేయడం ఈ కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. పెళ్లికి ముందు వీరిద్దరూ విదేశీ (బాలి) ట్రిప్‌కు వెళ్లాల్సి ఉండగా, కావాలనే తన పాస్‌పోర్టును ఓ హోటల్ వాష్‌రూమ్‌లో చింపేసి ఆ ట్రిప్ రద్దయ్యేలా ప్లాన్ చేసింది. ఆ తర్వాత జూన్ 14న లోహగఢ్ కోట వద్దే కేతన్‌ను హత్య చేసేందుకు మరో ప్రయత్నం చేసింది. అక్కడ పాము ఉందంటూ భయపెట్టి లోయలోకి నెట్టేయాలని చూసినా ఆ ప్లాన్ విఫలమైంది. చివరగా, తన పుట్టినరోజు వేడుకల పేరిట జూన్ 18న ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం కేతన్‌ను మళ్లీ అదే కోటకు తీసుకెళ్లింది. అక్కడ ముందుగానే కాపుకాసిన ప్రియుడు చేతన్‌తో కలిసి, ఫొటోలు తీస్తున్న కేతన్‌ను వెనుకనుంచి లోయలోకి దారుణంగా నెట్టేసి హత్య చేశారు.

కేతన్ లోయలో పడిపోయిన తర్వాత ఏమీ తెలియనట్లుగా సియా కట్టుకథలు అల్లడంతో పోలీసులు తొలుత దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే కేసు నమోదు చేశారు. అయితే, విచారణ సమయంలో ఆమె ప్రవర్తన, పొంతన లేని సమాధానాలు పోలీసులకు తీవ్ర అనుమానం తెప్పించాయి. దీంతో ఆమె మొబైల్ ఫోన్ డేటా, కాల్ రికార్డ్స్, సోషల్ మీడియా ఖాతాలు మరియు ఇతర డిజిటల్ ఆధారాలను టెక్నికల్ నిపుణుల సాయంతో నిశితంగా పరిశీలించడంతో అసలు గుట్టు రట్టయింది. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం, ఈ డెత్ మిస్టరీని హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ప్రధాన నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.