పశ్చిమ బెంగాల్ స్కూల్లో ఘోరం.. రూ.1.77 కోట్ల అక్రమ నగదు, సిక్ రూమ్‌లో కండోమ్ ప్యాకెట్లు గుర్తింపు!

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా కాంచ్రాపారా పరిధిలోని ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన ఘోరం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాంచ్రాపారా హార్నెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో భారీగా అక్రమ నగదు దాచారనే పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు అర్ధరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో స్కూల్ అకౌంట్స్ రూమ్ నుండి ఏకంగా రూ.1.77 కోట్ల కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. నోట్లను లెక్కించడానికి తెల్లవారుజాము వరకు మూడు క్యాష్ కౌంటింగ్ మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది.

అయితే ఆర్థిక అక్రమాల కంటే కూడా ఆ పాఠశాల ప్రాంగణంలో లభ్యమైన ఇతర వస్తువులు స్థానికులను, తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. విద్యార్థినులు అనారోగ్యానికి గురైతే విశ్రాంతి తీసుకోవడం కోసం కేటాయించిన ‘సిక్ రూమ్’ (Sick Room) లోపల ఒక విలాసవంతమైన పడకగది (Bedroom) సెటప్ కనిపించింది. అందులోని అల్మారాలు, మంచంపై పెద్ద ఎత్తున కండోమ్ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలను ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ షాకింగ్ ఉదంతం బయటపడటంతో స్కూల్ క్యాషియర్, అసిస్టెంట్ అకౌంటెంట్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ వికాస్ చంద్ర పాల్ స్పందిస్తూ.. ఆ నగదు విద్యార్థుల అడ్మిషన్ ఫీజులని, బ్యాంకులో వేయకుండా అకౌంట్స్ విభాగం నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. కానీ సిక్ రూమ్‌లో కండోమ్ ప్యాకెట్లు ఎలా వచ్చాయనే విషయంపై తనకు ఎలాంటి అవగాహన లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక బీజేపీ నేతలు మండిపడుతూ.. ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలకు సంబంధించిన నల్లధనమని, దీని వెనుక పెద్ద దందా దాగి ఉందని ఆరోపిస్తూ సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు.