సొంత కారు కొనాలనుకునే భారతీయులకు దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ‘మారుతి సుజుకి’ గట్టి షాక్ ఇచ్చింది. తమ వాహనాల ధరలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన ధరల పెంపు నిర్ణయం వచ్చే జూన్ (2026) నుంచి అమలుల్లోకి రానుంది. మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు గరిష్ఠంగా రూ. 30,000 వరకు ఉండవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ ఆకస్మిక ధరల పెంపునకు గల ప్రధాన కారణాలను మారుతి సుజుకి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్ రంగానికి అవసరమైన ముడిసరుకుల (ఇన్‌పుట్ కాస్ట్స్) ధరలు నిరంతరం పెరుగుతుండటం, దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తీవ్రమవ్వడమే ఇందుకు కారణమని తెలిపింది. రవాణా, నిర్వహణ వ్యయాలు భారీగా పెరగడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ పేర్కొంది.
గడిచిన కొన్ని నెలలుగా అంతర్గత వ్యయ నియంత్రణ చర్యల ద్వారా వినియోగదారులపై భారం పడకుండా మేనేజ్ చేయడానికి ప్రయత్నించామని, అయితే ప్రతికూల పరిస్థితులు కొనసాగుతుండటంతో ఆ భారంలో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదిలీ చేయాల్సి వచ్చిందని కంపెనీ యాజమాన్యం వివరించింది. ప్రస్తుతం మారుతి సుజుకి సంస్థ బడ్జెట్ మోడల్ ‘ఎస్-ప్రెస్సో’ (రూ. 3.49 లక్షలు) నుండి ప్రీమియం మోడల్ ‘ఇన్విక్టో’ (రూ. 28.7 లక్షలు) వరకు ఎక్స్-షోరూమ్ ధరల్లో కార్లను విక్రయిస్తోంది. తాజా నిర్ణయంతో ఎంట్రీ లెవెల్ కార్ల నుండి ఎస్‌యూవీల వరకు అన్నింటి ధరలూ పెరగనున్నాయి.