తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు, పెద్దపల్లిలో 46.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుండటంతో రెండు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమంటుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లన్నీ జనసంచారం లేక నిర్జనంగా మారుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.

తాజాగా నమోదైన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఏకంగా 48.1 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడల్లో 47.6 డిగ్రీలుగా నమోదైంది. అటు తెలంగాణలోనూ ఎండలు దంచి కొడుతుండగా.. పెద్దపల్లి జిల్లా ముత్తారంతో పాటు సూర్యాపేట జిల్లా మునగాలలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని దాదాపు 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ భీకరమైన వడగాల్పులు, ఎండల తీవ్రత రాబోయే సోమవారం వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అధికారులు హెచ్చరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రాకూడదని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాయలసీమ, నెల్లూరు తదితర కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *