తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలలో అంతర్భాగమైన గీత వృత్తికి, తాటి ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రముఖ, ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా స్వచ్ఛమైన తాటి కల్లు, నీరాను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. కల్లుపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, దీనిని ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధ పానీయంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సంప్రదాయ సహజ పానీయాల విశిష్టతను చాటిచెప్పేందుకు, గీత కార్మికులను గౌరవించేందుకు ఈ నెల 24న చిలుకూరు సమీపంలోని ఎక్స్‌పీరియం ఎకో పార్కులో ‘టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్‌పీరియం’ పేరిట భారీ మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ పార్కులో ఇప్పటికే వివిధ దేశాల నుండి సేకరించిన 250కి పైగా రకాల తాటి మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. ఈ వేదిక ద్వారా తాటి ఉత్పత్తులైన నీరా, స్వచ్ఛమైన కల్లుతో పాటు తాటి బెల్లం, తాటి ముంజెలతో తయారు చేసిన రకరకాల స్వీట్లు, స్నాక్స్‌ను ప్రదర్శించనున్నారు.
భవిష్యత్తులో తాటి వనాల పెంపకానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుందని, ఉపాధి హామీ పథకం (EGS) కింద తాటి, ఈత మొక్కల పెంపకాన్ని గ్రామీణ నర్సరీలలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కెఫేల తరహాలో తాటి ఉత్పత్తుల మార్కెటింగ్‌ను విస్తరించడం ద్వారా గీత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరిచి, వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, తాటి కల్లును అధికారికంగా ‘డ్రింక్ ఆఫ్ తెలంగాణ’ (తెలంగాణ పానీయం) గా గుర్తించే అంశంపై కూడా త్వరలోనే ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.