తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలను సందర్శించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

తేది:23-04-2026, TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల కళాశాల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించాలి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వెల్ఫేర్ వీక్ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఉదయం అల్పాహారాన్ని పరిశీలించి, భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సమయానికి అందుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. డైట్ మెను, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ విధానాలు, కిచెన్ షెడ్ నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ:
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వెల్ఫేర్ వీక్ నిర్వహణ ద్వారా ప్రజా ప్రభుత్వం సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నదని తెలిపారు. సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పోషకాహారం సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి విద్యార్థికి సమయానికి అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ:
ప్రభుత్వం సంక్షేమ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తు బలపడుతుందని పేర్కొన్నారు. కళాశాలల్లో ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు ఉత్తమ వసతులు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వారికి అందించే అల్పాహారం నాణ్యంగా, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. వంటశాలల్లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన పదార్థాలతో ఆహారం సిద్ధం చేయాలని సూచించారు. సంక్షేమ పాఠశాలల్లో మెనూ సమర్థవంతంగా అమలు కావాలని, విద్యార్థులకు సురక్షితమైన మరియు శుభ్రమైన వాతావరణంలో అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా సంక్షేమ అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, తహసీల్దార్, ఎంపిడివో, మండల విద్యాధికారి, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *