అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ..! వాటి పై చర్చ..!

రెండురోజుల టూర్‌కి ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్రమంత్రులు.. ఇంకోవైపు పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.

 

తెలంగాణలో బిజీగా సీఎం రేవంత్.. హోంమంత్రి అమిత్ షాతో భేటీ

 

బుధవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ భేటీ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. మావోయిస్టుల లొంగుబాటు, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మావోయిస్టు అగ్ర నాయ‌కుల లొంగుబాటు, వారి పున‌రావాసం వంటి అంశాలు చర్చించారు.

 

దాదాపు 590 మందికి పైగానే మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వ‌చ్చార‌ని వివరించారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అంద‌జేస్తున్న ప‌రిహారం, పున‌రావాసం విష‌యాల‌పై మాట్లాడారు.

 

తెలంగాణకు ఐపీఎస్‌ల పెంపు-మావోల ఇష్యూపై చర్చ

 

ఇదేకాకుండా గడిచిన రెండేళ్ల‌లో తెలంగాణ పోలీసింగ్‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని అమిత్ షా కు వివరించారు సీఎం. పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగం బలోపేతం, ఐపీఎస్‌ల కొరతపై ఈ సమావేశంలో చర్చించారు. విభ‌జ‌న తర్వాత 2016 లో తొలిసారి క్యాడ‌ర్ రివ్యూ జ‌రిగింద‌న్నారు.

 

2021లో జ‌ర‌గాల్సిన క్యాడ‌ర్ రివ్యూ ఆల‌స్యంగా గతేడాది జ‌రిగింద‌న్నారు. ఆ స‌మ‌యంలో కేవ‌లం ఏడుగురు ఐపీఎస్‌లను మాత్ర‌మే తెలంగాణ‌కు కేటాయించార‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా అనేక ఆధునిక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంద‌ని తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమీషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేసినట్టు తెలిపారు.

 

కొత్తగా ఫ్యూచర్ సిటీ కమీషనరేట్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగా తెలంగాణకు ఐపీఎస్‌ల అవసరాన్ని వివరించి తెలంగాణ క్యాడర్ సంఖ్యను పెంచవలసిన అవసరాన్ని తెలిపారు. శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ సిటీ జనాభా దృష్ట్యా, పరిపాలన సౌలభ్యం కోసం అదనంగా ఐపిఎస్ ల కేటాయింపు అత్యవసరమని తెలియజేశారు.

 

సీఎం రేవంత్‌రెడ్డి విషయాలపై కేంద్ర హోం శాఖ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *