అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారతదేశం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాల వల్ల దేశానికి తక్షణమే వచ్చే ఇబ్బందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంధన భద్రతకు పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF), ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా మంగళూరు, పాదూర్, విశాఖపట్నం లోని వ్యూహాత్మక ఇంధన నిల్వలను (Strategic Petroleum Reserves) పెంచుకోవడంతో పాటు.. దేశీయంగా ఇథనాల్ బ్లెండింగ్ వంటి చర్యల వల్ల మనం మెరుగైన స్థితిలో ఉన్నామని వివరించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
గతంలో భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడేదని.. కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వివిధ దేశాల నుండి చమురును కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వివాదాస్పద హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై ఆధారపడకుండా.. మన దేశ ఇంధన సంస్థలు వేర్వేరు మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. దీనివల్ల ఇరాన్ హెచ్చరికల ప్రభావం మన సరఫరాపై పడబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత తలెత్తే ప్రసక్తే లేదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పరిస్థితిని నిరంతరం సమీక్షించేందుకు పెట్రోలియం, విదేశీ వ్యవహారాలు, షిప్పింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ శాఖలతో కూడిన ఒక ఉన్నత స్థాయి అంతర మంత్రిత్వ శాఖల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదనంగా, పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఇంధన నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.