పవన్ కళ్యాణ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిప్పులు: ‘టీటీడీ నిధులు ఇస్తే తనవిగా చెప్పుకుంటున్నారు’

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరు చేస్తే, ఆ నిధులను పవన్ కళ్యాణ్ తానే ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. పవన్ తీరును విమర్శిస్తూ ఆయనను ఒక ‘ఇగోయిస్ట్’ (Egoist) అని సంబోధించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని విమర్శిస్తూ.. ఆయనకు చంద్రబాబు నాయుడు ప్రొడ్యూసర్ అని, లోకేష్ కో-ప్రొడ్యూసర్ అని, ప్రధాని మోదీ కొత్త ప్రొడ్యూసర్ అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో జనసేనకు కనీసం డిపాజిట్లు కూడా రావని తెలిసే తన పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారని ఆయన విమర్శించారు. గతంలో తెలంగాణ ప్రజల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినా స్పందించలేదని, కేవలం తెలంగాణలోని భూములు, నిధుల కోసమే ఆంధ్ర నాయకులు ఇక్కడికి వస్తున్నారని సెటైర్లు వేశారు.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనిరుధ్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఇలాంటి వ్యక్తిగత మరియు రాజకీయ ఆరోపణలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు పవన్‌ను ప్రచారానికి ఆహ్వానించిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ రాజకీయ సమీకరణాలను మరింత హీటెక్కించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *