తేది:7- 02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.
సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణ విధులపై మాస్టర్ ట్రైనర్ చే శనివారం రెండవ విడత శిక్షణ తరగతులను నిర్వహించి అవగాహన కల్పించారు.
శిక్షణ తరగతులను సందర్శించిన సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు పీ.ఓ, ఏ.పీ.ఓలకు కీలక సూచనలు చేశారు. హ్యాండ్ బుక్ లో పొందుపర్చిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలన్నారు.
పి.ఓలు, ఏపీవోలు చేపట్టాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు.
శిక్షణ తరగతులలో పీ.ఓలు, ఏ.పీ.ఓలు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీలలో శనివారం పి ఓ, ఏపీఓలకు శిక్షణ తరగతులను నిర్వహించారని, ఈ శిక్షణ తరగతులకు 1298 మంది పి ఓ లు, ఏ పీ ఓ లు హాజరైనట్లు ఎన్నికల శిక్షణా తరగతుల నోడల్ అధికారి రామాచారి తెలిపారు.