రెండు రోజుల పర్యటనలో భాగంగా మలేషియా చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కౌలాలంపూర్‌లో ఘన స్వాగతం లభించింది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి మోదీకి సాదర స్వాగతం పలికారు. అనంతరం జరిగిన భారత సంతతి సమ్మేళనంలో మోదీ ప్రసంగిస్తూ, ప్రపంచ వేదికపై భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశానికి ‘నమ్మకమే అతిపెద్ద కరెన్సీ’ అని ఆయన అభివర్ణించారు.
భారత్-మలేషియా ద్వైపాక్షిక సంబంధాల కోసం మోదీ ‘IMPACT’ (India Malaysia Partnership for Advancing Collective Transformation) అనే కొత్త నినాదాన్ని ప్రకటించారు. భారత్ సాధిస్తున్న విజయాలు కేవలం మన దేశానికే పరిమితం కాదని, అవి మలేషియా మరియు మొత్తం ఆసియా ఖండం అభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. యూకే, యూఏఈ వంటి అగ్రదేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడమే మన దేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు.
ముఖ్యంగా మలేషియాలోని భారత సంతతి సేవలను మోదీ కొనియాడారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భారత సంతతి ఇక్కడ ఉందని, వారు ఇరు దేశాల మధ్య వారధిలా ఉన్నారని ప్రశంసించారు. తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను ఇక్కడ శతాబ్దాలుగా కాపాడుతున్న తీరు అద్భుతమన్నారు. మలయా యూనివర్సిటీలో ఇప్పటికే ఉన్న తిరువళ్లువార్ చైర్‌తో పాటు, త్వరలోనే తిరువళ్లువర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మలేషియాలోని భారతీయులంతా తమ మిత్రులతో కలిసి ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ను సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు.