ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అట్టహాసంగా ముగిసింది. అయితే, లక్షలాది మంది భక్తులు వదిలి వెళ్లిన వ్యర్థాలు ఇప్పుడు మేడారం పరిసరాలను ఒక పెద్ద చెత్త కుప్పగా మార్చాయి. సుమారు 3 వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు ముక్కలతో పాటు భారీస్థాయిలో జంతు వ్యర్థాలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా జంతు బలుల వల్ల పేరుకుపోయిన కోళ్లు, మేకల తలకాయలు, తోళ్లు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఈ వ్యర్థాలను తొలగించడం పారిశుధ్య కార్మికులకు నరకప్రాయంగా మారింది. దాదాపు 6 వేల మంది సిబ్బంది క్లీనింగ్ ప్రక్రియలో నిమగ్నమవ్వగా, ఆ వ్యర్థాలను చూసి వాంతులు వస్తున్నాయని, చాలా మంది భక్తులు బాధ్యతారహితంగా వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క-సారలమ్మలపై భక్తితోనే ఈ కష్టమైన పనిని పూర్తి చేస్తున్నామని వారు చెబుతున్నారు.
ఈ భారీ వ్యర్థాల వర్గీకరణలో 48 శాతం వరకు ప్లాస్టిక్, గాజు వంటి భూమిలో కలిసిపోని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. కేవలం ప్లాస్టిక్ బాటిళ్లే 100 టన్నులకు పైగా ఉండటం గమనార్హం. మిగిలిన 52 శాతం ఆహార పదార్థాలు, బియ్యం, బెల్లం వంటివి కావడంతో అవి భూమిలో కలిసిపోయే అవకాశం ఉంది. మేడారం గ్రామస్తులకు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన ఈ పారిశుధ్య పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.