తేది:06-02-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య ప్రమీల – బాబులాల్ మరియు 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ మహమ్మద్ అఫ్సర్ భాయ్ గార్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు విస్తృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నాగరాజు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.అనంతరం స్థానిక టీ షాప్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే నాగరాజు అక్కడి యజమానిని సాదరంగా పలకరించి, స్వయంగా టీ తయారు చేసి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పంపిణీ చేస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ సాధారణ కార్యకర్తలా ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజలతో మమేకమై ప్రచారం చేయడం స్థానిక ప్రజల్లో విశేష ఆదరణను పొందింది. ఈ కార్యక్రమం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై మరింత విశ్వాసాన్ని పెంచింది.ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి దృక్పథానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువ నాయకులు కొండేటి అజయ్, కొండేటి దినేష్‌లతో పాటు మరికొందరిని ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి తక్షణ పరిష్కారం చూపే నిజమైన ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.అలాగే 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భుక్య ప్రమీల బాబులాల్ గారు, 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ మహమ్మద్ అఫ్సర్ భాయ్ గార్లను భారీ మెజారిటీతో గెలిపించి, వార్డుల అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు సుమారు రూ.294 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీ స్టేడియం, సబ్ జైలు, మున్సిఫ్ కోర్టు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ పనులలో అవుట్‌సోర్సింగ్ ఉంటే వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకే తొలి ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న అభివృద్ధి ఏమిటో ప్రజలు గమనించాలని, 2వ, 3వ వార్డుల అభ్యర్థులు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గిరిజన సోదర సోదరీమణులను ఎమ్మెల్యే నాగరాజు కోరారు.
ఈ కార్యక్రమంలో 2వ వార్డు ఇంచార్జీ జన్ను అనిల్ కుమార్, 2వ, 3వ వార్డు నాయకులు రైతు రాజు, కరాటే ప్రభాకర్, జన్ను అరుణాకర్‌లతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.