తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ‘తెలంగాణ జాతిపిత’ అని పిలవడాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. జాతిపిత అనే గౌరవం ఎవరికి వారు ఇచ్చుకునేది కాదని, అది ప్రజల హృదయాల నుండి రావాలని ఆయన స్పష్టం చేశారు. స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను కేసీఆర్ తన పాలనలో ఏనాడూ పట్టించుకోలేదని, తెలంగాణ అస్తిత్వాన్ని కేవలం తన వ్యక్తిగత మరియు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని కోదండరామ్ విమర్శించారు. ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చి, అసలైన పోరాట యోధులను పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రమే నిజమైన జాతిపిత అని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆరాధ్య దేవత అని రేవంత్ పేర్కొన్నారు. “ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తూ, ప్రజల వ్యక్తిగత విషయాలను దొంగచాటుగా వినే వారు జాతిపిత ఎలా అవుతారు?” అంటూ ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కాగా, రేవంత్ రెడ్డి మరియు కోదండరామ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. అసలు జాతిపిత అనే పదానికి అర్థం రేవంత్ రెడ్డికి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసిన చరిత్ర కేసీఆర్‌దని, ఆనాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని నిలదీశారు. కేసీఆర్ పోరాటం వల్లే నేడు అందరూ పదవులు అనుభవిస్తున్నారని, చరిత్రను వక్రీకరించడం సరికాదని హరీశ్ రావు హితవు పలికారు.