“రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పడొద్దు – ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టండి” – కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే ‘బూతు పురాణం’ విప్పుతున్నారని, ఆయన వేసే ‘తిట్ల ట్రాప్’లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ పడకూడదని కేటీఆర్ హితవు పలికారు. ప్రభుత్వం తన విఫలాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ వ్యక్తిత్వంపై విషం చిమ్ముతోందని ఆయన మండిపడ్డారు. వార్డుల్లో జరగాల్సిన మౌలిక వసతుల చర్చను పక్కదోవ పట్టించడమే రేవంత్ రెడ్డి వ్యూహమని, కాబట్టి గులాబీ శ్రేణులు వ్యక్తిగత విమర్శలకు పోకుండా కేవలం ప్రజా సమస్యల మీదే పోరాడాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతు భరోసా అందక రైతులు పడుతున్న ఇబ్బందులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థుల పడుతున్న అవస్థలు, గురుకుల పాఠశాలల్లో నాణ్యత లేని భోజనం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై ద్రోహం ఆరోపణలు చేశారు.

తెలంగాణకు ఇది ఒక “గ్రహణ కాలం” అని అభివర్ణిస్తూ, రేవంత్ రెడ్డి అనే ‘రాహువు’ నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాత కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఉద్యమ చరిత్రను అవమానించడమేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *