గత ఆరు రోజులుగా రాజానగరం, కూర్మాపురం పరిసర ప్రాంతాల్లో పశువులపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేసిన పెద్దపులి కథ సుఖాంతమైంది. అటవీ శాఖ అధికారులు ‘ఆపరేషన్ జాక్’ పేరుతో చేపట్టిన భారీ రెస్క్యూ ఆపరేషన్ శుక్రవారం సాయంత్రం ఫలించింది. కూర్మాపురంలోని ఒక పాడుబడిన ఇంట్లో పులి ఉన్నట్లు గుర్తించిన అధికారులు, పుణె నుంచి వచ్చిన నిపుణుల బృందం సాయంతో దానిని బంధించారు.
పులిని బంధించేందుకు అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఫ్లడ్ లైట్లను అమర్చారు. ఆ వెలుతురును చూసి పులి బయటకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేయగా, రెస్క్యూ బృందం చాకచక్యంగా మత్తు ఇంజెక్షన్ (Tranquilizer) ప్రయోగించింది. మత్తు ఇంజెక్షన్ తగిలి పులి స్పృహ కోల్పోవడంతో, అటవీ సిబ్బంది దానిని సురక్షితంగా బోనులో బంధించి కొత్తచెరువు మీదుగా తరలించారు.
ఈ పెద్దపులి గత కొన్ని రోజులుగా రాజానగరం మండలంలోని భూపాలపట్నం, జి.యర్రంపాలెం వంటి ప్రాంతాల్లో ఆవులపై దాడులు చేసి చంపడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. హైవేపైకి కూడా పులి రావడంతో అధికారులు కొన్ని పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. ప్రస్తుతం బంధించిన పులిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు (Zoo) తరలించినట్లు అధికారులు వెల్లడించారు. పులి చిక్కడంతో రాజమండ్రి పరిసర గ్రామాల ప్రజలు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.