తేది: 06-02-2026 హన్మకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: దేశంలోని విభిన్న సంస్కృతుల మధ్య వారధిగా యువత నిలవాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు.బాలసముద్రంలోని యూత్హాస్టల్‌లో ఏర్పాటు చేసిన మై భారత్ వరంగల్ ఆధ్వర్యంలో, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమాని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్రానికి చెందిన 40 మంది యువతీ యువకులతో పాల్గొన్నారు. వీరికి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలపై అవగాహన కల్పించనున్నారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతు భారతదేశం అనేక భాషలు, మతాలు, సంస్కృతులతో కూడిన మహా సమాఖ్య దేశమని అన్నారు. ఈ వైవిధ్యాన్ని బలంగామార్చే బాధ్యత యువతదేనని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల యువతతో కలిసి మెలిసి ఉండటం ద్వారా పరస్పర గౌరవం, అవగాహన పెరుగుతుందని చెప్పారు. యువతలో ద్వేష భావాలు పెరగకుండా, ఐక్యత, సహన భావాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎంపీ స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించి తెలంగాణ వారసత్వాన్ని తెలుసుకోవాలని యువతకు సూచించారు. ‘మేరయువభారత్’ వేదికగా సేవలందించిన యువజన నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎదగడం గర్వకారణమని పేర్కొంటూ, ఇటీవల సర్పంచులు, ఉప సర్పంచులుగా ఎన్నికైన వారిని ఎంపీ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపర్డెంట్ ఆర్కియాలజీ ఇంజనీర్ కృష్ణ చైతన్య, ఆర్డీవో రాథోడ్ రమేష్, డిప్యూటీ డైరెక్టర్ మేర యువభారత్ అన్వేష్ చింతల, మధు తదితరులు పాల్గొన్నారు.