
తేది:3-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా : మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని అవుసులపల్లి, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గారు విస్తృతంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల లోపలి ఏర్పాట్లు, బ్యారికేడింగ్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు విధులు, పోలింగ్ సిబ్బంది భద్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని అడిగి భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అలాగే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అనధికార ప్రచారం, గుంపులు, వాహనాల నిలుపుదలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మెదక్ రూరల్ ఎస్ఐ లింగం, హవెలిఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐ విట్టల్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.