ఆన్‌లైన్‌లో సరుకుల ఆర్డర్‌

విక్రమ్‌ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి..లాక్‌డౌన్‌ నేపథ్యంలో వర్క్‌ఫ్రంహోంకే పరిమితమయ్యారు. దీంతోఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలను ఒక్క క్లిక్‌తో బిగ్‌బాస్కెట్‌కు ఆర్డరుచేస్తున్నారు. దీంతో సమయం ఆదా అవడమే కాదు నచ్చిన..మెచ్చిననాణ్యమైన సరుకులను సరసమైనధరలకు ఇంటి గడప వద్దనే పొందవచ్చని ఆయన చెబుతున్నారు.

ఇది విక్రమ్‌ ఒక్కడి పరిస్థితే కాదు..లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకే గ్రేటర్‌ సిటీజన్లు మక్కువ చూపుతున్నారు. దీంతో బిగ్‌బాస్కెట్, బిగ్‌»బజార్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ విక్రయ ఈ–కామర్స్‌ సంస్థల గిరాకీ అమాంతం పెరిగింది. నెటిజన్లుగా మారిన గ్రేటర్‌ సిటీజన్లు కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఇళ్లకే పరిమితం కావడం..బయటకు వెళితే పోలీసుల ఆంక్షలు..కావాల్సిన వన్నీ ఒకేచోట దొరకవన్న కారణంతో ఈ–సైట్లను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా ఐటీ, బీపీఓ, కెపిఓ, కార్పొరేట్‌ రంగాల్లో పనిచేస్తున్నవారే గతంలో ఈ–కామర్స్‌ సంస్థలకు నిత్యావసరాల కొనుగోలుకు ఆర్డర్లు చేసేవారు.

ఇప్పుడు మద్యాదాయ, వేతన జీవులు, గృహిణులు, వృద్ధులు సైతం ఇప్పుడు ఈ సైట్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో గ్రేటర్‌ పరిధిలో సుమారు పది ఈ–కామర్స్‌ సంస్థలకుఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దైనందిన జీవితంలో అవసరమైన ఉప్పు..పప్పు..పేస్ట్, పండ్లు, కూరగాయలు..ఒక్కటేమిటి..అగ్గిపుల్లా..సబ్బుబిల్లా అన్న తేడాలేకుండా వీరివ్యాపారం ఊపందుకుంది. గత పదిరోజులుగా నగరంలో సుమారు రూ.500 కోట్ల మేర నిత్యావసరాలను విక్రయించినట్లు ఆయా సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు రవాణా నిలిచిపోవడంతో  కస్టమర్లు కోరిన మొత్తంలో సరుకులు సరఫరా చేయలేకపోతున్నామన్నారు. ఇప్పటికే తమ గోడౌన్లలో కందిపప్పు, పెసరపప్పు, మినప గుండు తదితర సరుకుల నిల్వలు క్రమంగా నిండుకుంటున్నాయని బిగ్‌బాస్కెట్‌ సంస్థ జోనల్‌ మేనేజర్‌ ప్రవీణ్‌  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *