రేవంత్ రెడ్డి ప్లాన్ అందరికీ అవినీతి మరకలు అంటించడమే: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉందని, అందుకే ఇప్పుడు అందరికీ అటువంటి మచ్చనే అంటించాలని ఆయన చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీశ్ రావు విచారణకు హాజరయ్యారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు సిట్ విచారణల పేరుతో తమాషాలు చేస్తోందని విమర్శించారు. అధికారం చేపట్టినప్పటికీ రేవంత్ రెడ్డి తీరు మారలేదని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ‘స్కామ్ గ్రేస్’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఎందుకు మాట్లాడలేదని, కేవలం లీకులతో ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని ప్రశ్నించారు.

సింగరేణి టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి కుటుంబం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు తొమ్మిది సింగరేణి టెండర్లను రేవంత్ రెడ్డి కుటుంబమే నియంత్రించిందని, అంచనా విలువ కంటే అధికంగా టెండర్లు వేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ‘సైట్ విజిట్’ అనే కొత్త నిబంధనను తీసుకువచ్చి, టెండర్లు వేసే కంపెనీల వివరాలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం బావమరిది సృజన్ రెడ్డి ప్రధాన ముద్దాయి అని కేటీఆర్ స్పష్టం చేశారు.

సింగరేణి దొంగతనంలో బీజేపీకి వాటాలు లేకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఉన్న సింగరేణికి ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు కేంద్రం మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కాంగ్రెస్ కుంభకోణాలను బీఆర్ఎస్ బయటపెట్టిన ప్రతిసారి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఎన్ని విచారణలు చేసినా, కాంగ్రెస్ వైఫల్యాలపై తాము ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *