తేది:17-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు, జనవరి 17: రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పటాన్‌చెరులోని RTC బస్‌స్టాండ్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు మరియు పాదచారులు రాకపోకలు సాగిస్తుండటంతో, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
అధిక వాహన రద్దీ కారణంగా గత కాలంలో ఈ ప్రాంతంలో పలు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, అందువల్ల RTC బస్‌స్టాండ్ పరిసరాలను రోడ్ బ్లాక్ స్పాట్‌గా గుర్తించినట్లు తెలిపారు. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటం, అక్రమ పార్కింగ్, సరైన ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సూచిక బోర్డుల లేమి, రాత్రి వేళ వీధి దీపాల కొరత వంటి అంశాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. RTC బస్‌స్టాండ్ వద్ద ప్రత్యేక బస్ బేలు ఏర్పాటు చేయడం, పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు మరియు జీబ్రా క్రాసింగ్‌లు కల్పించడం, ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, అలాగే ఉదయం–సాయంత్రం పీక్ అవర్స్‌లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ చర్యలు అమలైతే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ అవగాహన సదస్సులో పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలు నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, హెడ్ గార్డ్ కిషోర్ తో పాటు పలువురు పౌరులు పాల్గొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరిగా చేయాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు.