ఎస్‌ఐఎస్‌ఎఫ్–2026కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్. సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖ డైరెక్టర్.

తేది:17- 01- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా: రాష్ట్రం, జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేసేలా సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ (SISF)–2026 నిర్వహణకు అన్ని విధాల పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఈనెల 19 నుంచి రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్–2026 ఏర్పాట్లను శనివారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గాడియం స్కూల్ ప్రాంగణమంతా కలియతిరిగి సైన్స్ ఫెయిర్‌కు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా తనిఖీ చేశారు.ప్రధానంగా ఎంట్రెన్స్, ఎగ్జిట్ మార్గాలు, సూచిక బోర్డుల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు, భద్రతా చర్యలు, వసతి సౌకర్యాలు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థులు,ఉపాధ్యాయులు, అతిథులకు అవసరమైన వసతి, భోజనం, రవాణా ఏర్పాట్లపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సౌత్ ఇండియా నలుమూలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలన్నారు. ఎగ్జిబిట్లను ప్రదర్శించేందుకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు.
సైన్స్ ఫెయిర్‌ను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు కూడా సులభంగా చేరుకునేలా, స్పష్టమైన సూచికలు, భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన అన్ని కమిటీల సభ్యులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
సైన్స్ ఫెయిర్ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన వసతి, భోజనం, రవాణా, భద్రత, పారిశుధ్యం, వైద్య సేవలు, విద్యుత్, తాగునీరు తదితర విభాగాల కమిటీలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఆరు రాష్ట్రాల నుంచి పాల్గొననున్న విద్యార్థులు ఆనందంగా, ఉల్లాసంగా సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, నోడల్ అధికారి లింబాజీ,Print & మీడియా కమిటీ కన్వీనర్ MD జాకీర్ హుస్సేన్ మండల విద్యాశాఖ అధికారులు, నాగేశ్వర్ నాయక్, రాములు, విద్యాసాగర్, విజయకుమార్, వెంకట్ నర్సిములు, అనురాధ వివిధ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *