మావోయిస్టులకు భారీ దెబ్బ: పీఎల్‌జీఏ చీఫ్ దేవా సహా 20 మంది లొంగుబాటు!

మావోయిస్టు ఉద్యమానికి దేశ చరిత్రలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PLGA) చీఫ్, మోస్ట్ వాంటెడ్ నేత బరిసెదేవా అలియాస్ దేవా శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవాతో పాటు మరో 19 మంది సభ్యులు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తర్వాత దేశంలోనే జరిగిన అతిపెద్ద లొంగుబాటుగా ఇది రికార్డు సృష్టించింది. గతంలో అగ్రనేత మాడ్వి హిడ్మాకు అత్యంత సన్నిహితుడిగా, వ్యూహకర్తగా పేరుగాంచిన దేవా లొంగుబాటుతో అడవిలో అన్నల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

డీజీపీకి మావోయిస్టులు భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలను అప్పగించడం ఈ లొంగుబాటులో అత్యంత కీలకమైన అంశం. వీటిలో ఇజ్రాయెల్ మరియు అమెరికా తయారీ ఆయుధాలతో పాటు 48 మౌంటెడ్ LMG వెపన్స్, AK-47లు, స్నైపర్ రైఫిళ్లు ఉన్నాయి. వీటితో పాటు దళం వద్ద ఉన్న రూ. 20 లక్షల నగదును కూడా పోలీసులకు అందజేశారు. దేవాపై ప్రభుత్వం గతంలో రూ. 75 లక్షల రివార్డు ప్రకటించింది. హిడ్మా మరణం తర్వాత పీఎల్‌జీఏ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దేవా లొంగిపోవడం పార్టీని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన ‘మార్చి 2026’ డెడ్ లైన్ నాటికి మావోయిస్టు రహిత భారత్‌ను సాకారం చేసే దిశగా వరుస పరిణామాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీలు మరియు పోలీసులు పెంచుతున్న ఒత్తిడి కారణంగా కీలక నేతలు లొంగుబాట పడుతున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున రూ. 1.80 కోట్ల రివార్డు సొమ్మును పంపిణీ చేయనున్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ. లక్ష నగదును డీజీపీ అందజేసి, అడవిలో మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి రావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *