తేది:3-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా: ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చడమే ఆపరేషన్ స్మైల్–12 ప్రధాన లక్ష్యమని తెలిపారు.
చిన్న వయస్సులోనే పనులకు నెట్టబడుతున్న పిల్లలు, రోడ్లపై భిక్షాటనకు పాల్పడుతున్న బాలలు, తప్పిపోయి దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదంలో ఉన్న పిల్లలను గుర్తించి వారికి రక్షణ కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. పిల్లలకు విద్య, భద్రత, ఆరోగ్యం వంటి మౌలిక హక్కులు అందేలా పోలీస్ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు.
సమాజంలోని ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని, ఎక్కడైనా బాల కార్మికులు లేదా అనాధగా కనిపించే పిల్లలు ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
బాలల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే ఆపరేషన్ స్మైల్–12 యొక్క అసలైన లక్ష్యం అని పేర్కొంటూ, పిల్లల భవిష్యత్తును కాపాడటమే సమాజ బాధ్యత అని తెలిపారు.
బాలల సహాయానికి: 100 / 1098