చైనా వ్యతిరేక వైఖరిని దూకుడుగా ముందుకు తీసుకెళ్లడంపై అమెరికా, ఇతర కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం

30 దేశాలతో కూడిన నాటో కూటమి ఇటీవల సమావేశమై తన కమ్యూనిస్టు వ్యతిరేక, చైనా వ్యతిరేక వైఖరిని దూకుడుగా ముందుకు తీసుకెళ్లడంపై అమెరికా, ఇతర కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చైనాకు వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధం కోసం నాటో రంకెలు వేయాన్ని ముక్తకంఠంతో ఖండించాయి. ఈ మేరకు అమెరికా, స్పెయిన్‌, ఐర్లాండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌. బంగ్లాదేశ్‌ కమ్యూనిస్టు పార్టీలతో సహా సోషలిస్టు వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ క్రొయోషియా సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. చైనా వ్యతిరేక, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని రేపడంపైనే తన దృష్టి ఉందని నాటోకు డిఫాక్టో లీడర్‌గా ఉన్న అమెరికా పేర్కొందని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక లోకానికి ముప్పు అని తెలిపాయి. అన్ని రంగాల్లో పెరుగుతున్న చైనా విజయాలు, శక్తి నేపథ్యంలో ప్రపంచ క్రమంలో తమ అధిపత్యానికి, నయాఉదారవాద విధానాలకు చెక్‌ పడుతుందేమోనని అధ్యక్షుడు ఒబామా హయాంలో అమెరికా పెట్టుబడిదారులు భయపడ్డారని, అదేవిధంగా ట్రంప్‌ హయాంలో చైనా, సోషలిస్టు వ్యతిరేక విధానాల అమలులో అమెరికా ప్రభుత్వం మరింత దూకుడు పెంచిందని, దీన్ని అనేక మంది ఒక ప్రచ్ఛన్న యుద్ధంగా చూశారని పేర్కొన్నాయి.
అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాతైనా చైనాతో శత్రుత్వం కొంతమేర అయినా తగ్గుతుందని భావించినా అది జరగలేదని పార్టీల ఉమ్మడి ప్రకటన పేర్కొంది. బైడెన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన కొత్త విదేశాంగ విధానం చైనాతో పాటు చైనా వ్యూహాత్మక మిత్రదేశంగా ఉన్న రష్యాతో శత్రుత్వాన్ని అన్నివిధాలుగా మరింత పెంచుకుందని తెలిపింది. కమ్యూనిస్టు వ్యతిరేక దురాక్రమణ విధానాలను అవలంభిస్తున్న దేశాలతో కూడిన నాటో కూటమి ఇటీవల సమావేశం కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించిందని కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు విమర్శించాయి. ఈ సమావేశంలో నాటో ప్రధాన కార్యదర్శి జాన్‌ స్టోలోన్‌బర్గ్‌ మాట్లాడుతూ.. ‘చైనా అభివృద్ధి’ అనేది నాటోకు ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. పేదరికాన్ని విజయవంతంగా పారద్రోలిన చైనా, నాటో అధికారాలకు ఏ విధంగా ముప్పు కలిగిస్తుంది? అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఉండదని, అమెరికా ఆధిపత్యానికి, పెట్టుబడిదారుల లాభాలకు చైనా అడ్డంకిగా మారిందన్న అక్కసుతోనే ఇటువంటి కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నాయి.
చైనా, రష్యా చుట్టూ అన్ని వైపులా వందలాది సంఖ్యలో అమెరికా, నాటో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు యూరప్‌కు విస్తరించవద్దని హామీలు ఉన్నప్పటికీ, నాటో రష్యా సరిహద్దులకు సమీపంగా వెళ్తూ, ఆర్థిక ఆంక్షలను విధిస్తూ.. ఉక్రెయిన్‌లో రష్యన్‌ వ్యతిరేక, ఫాసిస్ట్‌ శక్తులకు సహాయం చేస్తోందని పార్టీలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. మరో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచ్ఛన్న యుద్ధంలో దిగేందుకు ప్రపంచం ఏమాత్రం సిద్ధంగా లేదని, 20వ శతాబ్ధంలో కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపాయి. ఆగేయాసియా నుంచి ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వరకు స్వేచ్ఛ, మెరుగైన ప్రపంచం కోరుకునే లక్షలాది కార్మికులు, వారి కుటుంబాలు ఈ గ్లోబల్‌ కేపటలిజం బారిన పడ్డాయని, అమెరి కాతో పాటు దాని మిత్రపక్ష దేశాల్లోని యువతను కూడా ఈ యుద్ధాలు వదల్లేదని వివరించాయి. చరిత్రను మరింత ప్రమాదకరమైన రూపంలో పునరావృతం చేసేందుకు అనుమతించేది లేదని నాటో దేశాల కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు తమ సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *