రేషన్ కార్డుదారులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మరో నెల రోజులపాటు గడువును పెంచింది. ప్రస్తుతం ఉన్న గడువు మార్చి 31 తో ముగిసింది. తాజాగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించింది.
వినియోగదారులకు శుభవార్త..
రేషన్‌కార్డు దారులకు బిగ్ రిలీఫ్. e-KYC ప్రక్రియ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించింది ప్రభుత్వం. ఈ ప్రక్రియ ద్వారా అనర్హులను గుర్తించి వారి కార్డులను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ కేవైసీకి శ్రీకారం చుట్టింది. రేషన్ షాపులు, ఆధార్ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఏప్రిల్ 30లోపు ఈ గడువును వినియోగదారులు ఉపయోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.
మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండదని అంటున్నారు. నార్మల్‌గా అయితే మార్చి 31తో గడువు ముగిసింది. మరోసారి కేంద్రం ఏప్రిల్ 30 వరకు అవకాశం ఇచ్చింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సబ్సిడీ పంపిణీలో మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.
ఇందులో భాగంగానే రేషన్ కార్డుదారులకు ఈ విషయాన్ని తెలంగాణలో అధికారులు తెలిపారు. ఈ-కేవైసీ పూర్తి చేయని వారి రేషన్ కార్డులు రద్దు కావచ్చునని చెబుతున్నారు అధికారులు. అదే జరిగితే ఉచిత రేషన్ సదుపాయం కోల్పోయే ప్రమాదం ఉంది. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కొన్ని నెలలుగా ప్రచారం చేస్తోంది.
రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరణ
మరోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి గడువు సైతం విధించింది. గడువు పూర్తి కాగానే ప్రభుత్వ సిబ్బంది విచారణ చేపట్టి అర్హులైన వారికి రేషన్ కార్డు మంజూరు చేస్తారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదని ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
అధికారంలోకి రాగానే అర్హులైన అందరికీ వైట్ రేషన్ కార్డు మంజూరు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కూడా. మీ-సేవా కేంద్రాల ద్వారా మార్పులు-చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అధికారులు ఆయా దరఖాస్తులను స్క్రుటినీ చేయనున్నారు. ఆ తర్వాత అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తారు.