పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం..!

తమ కోర్కెలు తీరేందుకు కొందరు మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు. ఫలానా క్షుద్రపూజలు చేస్తే మీ డ్రీమ్ నిజం అవుతాయని చెబుతారు. దీనికి అర్థరాత్రి వేళ శ్మశానం ప్రాంతాన్ని ఎంచుకుంటారు. లేదంటే ఊరి చివర ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కాకపోతే ఇక్కడంతా వెరైటీగా చేస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు పసిగట్టారు. చివరకు ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది.

 

స్కూల్ నేపథ్యం

 

సిరిసిల్ల పట్టణంలోని నడిబొడ్డున కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఫేమస్ అయిన పాఠశాల కూడా. అక్కడ చదివేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఉపాధ్యాయుులు, టీచింగ్, ఫలితాల గమనించిన విద్యార్థులు అక్కడ చేరేందుకు ఇష్టపడతారు కూడా.

 

కుసుమ రామయ్య జిల్లా పరిషత్ పాఠశాలలో క్షుద్ర పూజ తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి పూజలు అర్థరాత్రి వేళ, ఊరికి చివరలో చేస్తుంటారు కొందరు మంత్రగాళ్లు. కానీ ఇక్కడ మాత్రం తెల్లవారుజామున నాలుగైదు గంటల సమయంలో ఆ తరహా పూజలు చేయడం అనుమానం మొదలైంది. అటువైపుగా వెళ్తున్న కొందరు ఈ తతంగాన్ని చూసి స్థానికులకు చెప్పడంతో అలర్ట్ అయ్యారు.

 

క్షుద్ర పూజ ఎవరి కోసం?

 

ఇక పాఠశాల విషయానికి వద్దాం. పాఠశాల టైమింగ్స్ పూర్తికాగానే గేట్లకు తాళం వేస్తారు. కాకపోతే క్షుద్రపూజల కోసం ఉదయం ఐదు గంటల సమయంలో పాఠశాల గేటు తెరిచారు. స్కూల్ గేటు ఓపెన్ చేయడం వెనుక రికార్డు అసిస్టెంట్ వెంకటేశం ప్రమేయం ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం బయటపడగానే అక్కడి నుంచి వెంకటేశం పరారయ్యాడు.

 

రకరకాల ప్రశ్నల వెనుక

 

ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా చర్చ మొదలైపోయింది. వేకువ జామున పాఠశాల ఆవరణలో మేక పిల్లను బలి ఎందుకు ఇవ్వబోయారు? పూజల కోసమే పాఠశాల గేట్లు ఓపెన్ చేశారా? దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది? ఈ పూజలు ఎవరి కోసం, ఎందుకు? పాఠశాల పిల్లలను టార్గెట్ చేశారా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

 

బలి పూజపై రికార్డు అసిస్టెంట్ వెంకటేశం ముఖం చాటేశాడు. పాఠశాల వాస్తు సరిగా లేదంటూ కుంటు సాకులు చెప్పడం మొదలుపెట్టారు. అందుకే ఈ తరహా పూజలు చేస్తున్నామని మీడియా ప్రశ్నలకు డొంక తిరుగు సమాధానం ఇస్తున్నాడు. పాఠశాల కోసం అయితే స్టాప్ అంతా ఉండాలి కానీ, ఒక్కరు లేదా ఇద్దరు రావడమేంటన్నది కొందరు ప్రశ్న.

 

విచారణ మొదలైంది

 

ఈ వ్యవహారంపై స్థానికులు జిల్లా విద్యాధికారికి సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాలతో మండల విద్యాధికారి రఘుపతి అక్కడికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. పాఠశాల ప్రారంభమైన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అన్నారు. దీనికి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 

ప్రభుత్వ పాఠశాలలో మూఢ నమ్మకాల పేరిట ఇలాంటి పూజలు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైతిక విలువలకు బదులుగా మూఢనమ్మకాలు ప్రోత్సహించడమేంటన్నది కొందరి ప్రశ్న. ఈ వ్యవహారంపై ఇంకెంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *