అన్నీ ఆయనే చేశారు.. రోజా, అంబటి..!

వైఎస్ వివేకా హత్య కేసు గురించి షర్మిల ప్రెస్ మీట్ పెడితే వైసీపీ నుంచి రోజా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు చెప్పినట్లే ఆమె మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఆస్తిలో వాటా కోసం షర్మిల ప్రెస్ మీట్ పెడితే వైసీపీ నుంచి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ అని అన్నారు.

 

అసలీ రెండు విషయాలకు, చంద్రబాబుకి సంబంధం ఏదైనా ఉందా..? ఏపీలో కామన్ మ్యాన్ కి కూడా ఈ విషయం అర్థమవుతుంది. కానీ వైసీపీ వాళ్లు మాత్రం ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబే కారణం అంటున్నారు. నిజంగానే వైసీపీ నేతల్లోసరుకైపోయిందా..? కనీసం విమర్శలకు కూడా సూటిగా, స్పష్టంగా స్పందించలేరా..?

 

అంబటి ఏమన్నారంటే..?

షర్మిల మొదట్లో తెలంగాణలో పార్టీ పెట్టారని అంతవరకు బాగానే ఉంది కానీ, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి జగన్ పై యుద్ధం ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆస్తి తగాదాలుంటే కోర్టుకెళ్లాలి కానీ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబుకి సహాయం చేయడానికే ఆమె జగన్ పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో ఆమె తోలుబొమ్మ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే అప్పుడు షర్మిల రెడీగా ఉంటారన్నారు. ప్రస్తుతం వక్ఫ్ బిల్లుకి మద్దతిచ్చి చంద్రబాబు ఏపీలో ఇబ్బంది పడుతున్నారని, ముస్లింలు టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఉందని, ఇలాంటి టైమ్ లో షర్మిలను తెరపైకి తెచ్చారని అన్నారు అంబటి. గతంలో తిరుమల లడ్డూ వ్యవహారంపై విమర్శలు రావడంతో అప్పుడు కూడా షర్మిల, జగన్ పై విమర్శలు చేశారని గుర్తు చేశారు. పెళ్లైన తర్వాత పాతికేళ్ల తర్వాత అన్న ఆస్తిలో వాటాలేంటని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని, హెరిటేజ్ లో వారికి వాటా ఇస్తారా అని ప్రశ్నించారు అంబటి.

 

 

లాజిక్ ఉందా..?

 

అంబటి ప్రశ్నలు వినడానికి బాగానే ఉన్నా.. అందులో లాజిక్ లేదని అంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు చెల్లెళ్లకు వాటాలు ఇస్తారా, అసలు వాళ్లు అడిగారా.. అనే విషయాలు అంబటికి తెలుసా అని అంటున్నారు. ఆస్తిలో వాటా కావాలంటున్న షర్మిలకు సమాధాం చెప్పలేక జగన్ ఇలా అంబటి, రోజా లాంటి వారిని తెరపైకి తెస్తున్నారని మండిపడుతున్నారు.

 

సమాధానం చెప్పలేకే..!

 

షర్మిల ప్రశ్నలకు చంద్రబాబుకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఆమె వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక జగన్ ఇలా పార్టీ నేతల్ని ఉసిగొల్పుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పోనీ టీడీపీ నేతల కామెంట్లు పక్కనపెట్టినా.. రోజా, అంబటి వీడియోలకు, వారిచ్చిన సమాధానాలకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. తల్లి, చెల్లి విషయంలో సతమతమవుతున్న జగన్, ఇక రాష్ట్ర ప్రజల తరపున రాజకీయం ఏం చేస్తారంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అన్నిటికీ చంద్రబాబే కారణం అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కూడా నెగెటివ్ కామెంట్లు పడుతున్నాయి.

 

పోనీ నిజంగానే షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనుకుందాం. మరి ఈ డైవర్షన్ ని జనాలకు అర్థమయ్యేలా చెప్పేందుకు జగన్ ఎందుకు ప్రయత్నించడం లేదనేదే అసలు ప్రశ్న. జగన్ నేరుగా స్పందించకపోవడంతో షర్మిల వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల ప్రశ్నలు సంచలనం అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *