పట్టాల పంపిణీలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..

పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ అనేది రెండున్నర దశాబ్దాల కల అని అన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం ఏర్పడిన కేవలం 10 నెలల్లో అందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఓడిన చోట గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పుకొచ్చారు.

 

మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

 

అంతేకాదు ప్రతిపక్షంలో ఉండగా 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని గుర్తు చేశారు. సొంత నియోజకవర్గం మంగళగిరిలో ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు మంత్రి. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందించామని గుర్తు చేశారు.

 

ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. మీ కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని, సూపర్ సిక్స్‌తోపాటు ఇచ్చిన ఒక్కోహామీని నెరవేర్చే పనిలో నిమగ్నమైనట్టు తెలిపారు.

 

టార్గెట్ వన్ ఇయర్

 

ఏడాదిలో మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నాటికి ప్రారంభోత్సవం చేస్తామన్నారు. తెలుగుదేశం కంచుకోటగా కుప్పం మాదిరిగానే మంగళగిరిని మారుస్తామన్నారు. సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చానని, ఇచ్చిన దాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

 

యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు మంత్రి లోకేశ్. నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి మొత్తం 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు.

 

అనుక్షణం పని చేశా?

 

2019 ఎన్నికల్లో తనకు పరిచయం లేని మంగళగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తక్కువ సమయం ఉన్నందున తన గురించి ప్రజలకు తెలియదన్నారు. పోటీ చేసిన 20 రోజులకే ఎన్నికలు ముగిశాయని, తక్కువ మెజార్టీతో ఆనాడు ఓడిపోయడం బాధ కలిగిందన్నారు.

 

ఎలాగైనా మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవాలని నిర్ణయించుకున్నట్టు మనసులోని మాట బయటపెట్టారు. గెలవాలనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీ కోసం పని చేశానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సంజీవని పేరుతో తాడేపల్లి, మంగళగిరితో క్లినిక్ తోపాటు దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్ పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

 

యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ అందించినట్టు వెల్లడించారు. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టామన్నారు. నిరుపేద కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడేలా తోపుడు బండ్లు అందించామన్నారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం శిక్షణతోపాటు కుట్టుమిషన్లను అందించామన్నారు.

 

వాటికి సమయం కావాలి

 

ప్రభుత్వ భూములను మొదటి విడతగా అందిస్తామన్నారు మంత్రి లోకేష్. ఎండోమెంట్, రైల్వే భూముల విషయంలో కొంచెం సమయం పడుతుందన్నారు. కాలువ, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వడం కోసం అందరితో చర్చించేందుకు కొంత సమయం పడుతుందన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *