డ్రామాలు ఆపు కేటీఆర్.. ఇంత దారుణానికి పాల్పడతారా.. మంత్రి శ్రీధర్ బాబు..

డ్రామాలు ఆపు కేటీఆర్.. దాడులు చేయించింది మీరేనని తెలిశాక, రైతులు అంటూ కొత్త నినాదం తీస్తావా.. మీ రౌడి బ్యాచ్ పై కేసులు పెడితే, రైతులు అంటావా.. ఇప్పటికైనా మారు.. లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.

 

వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసుకు సంబంధించి, తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కిన విషయం తెలిసిందే. ఓ వైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ కుటిల రాజకీయాలు ఈ దాడితో బయటపడ్డాయని విమర్శిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం దాడి సాకు చూపి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ప్రతి విమర్శలు చేస్తోంది.

 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అసలు దాడికి ఉసిగొలిపింది బీఆర్ఎస్ పార్టీ అంటూ.. పైకి మాత్రం కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నట్లు దయాకర్ అన్నారు. దాడులు చేయించింది మీరే అంటూ తెలిపిన దయాకర్.. అందరికీ అసలు విషయం తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండేందుకు రైతుల పేరు మీద పరామర్శలు చేయడం కేటీఆర్ కే చెల్లిందన్నారు.

 

ప్రభుత్వం రైతులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ రౌడీ మూకలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడాది కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పాలనను ఓర్వలేక అధికారం కోసం పాకులాడేందుకు బీఆర్ఎస్ పార్టీ మరింత దిగజారడం మంచి పద్ధతి కాదంటూ సూచించారు. అధికారుల మీద దాడులు చేయించిన మీతో తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా పొలిటికల్ డ్రామాలు ఆపాలంటూ హితవు పలికారు.

 

అధికారులను చంపడం ప్రజాస్వామ్యమా.. మంత్రి శ్రీధర్ బాబు

పరిశ్రమలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటే, బీఆర్ఎస్ కు చెందిన గూండాలు మరో వైపు అధికారులను చంపే ప్రయత్నం చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కేటీఆర్ అరెస్ట్ కోసం పాకులాడుతున్నారని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ సాగిస్తున్నామన్నారు.

 

అమాయకులైన గిరిజన రైతులను అడ్డుపెట్టుకొని, కేటీఆర్ దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి పాలనలో బలవంతంగా భూములు లాక్కున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ప్రజల వద్దకు కలెక్టర్ ను పంపిస్తే, బీఆర్ఎస్ ముసుగు వేసుకున్న కొందరు దాడికి యత్నించినట్లు ఆరోపించారు. రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేందుకు పరిశ్రమలు అవసరమని, అప్పుడే నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *