గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్..!

రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో నాసిరకం భోజ‌నం పెడితే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాసిరకం బియ్యం, కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తే బాధ్యుల‌తో ఊచ‌లు లెక్క‌పెట్టిస్తామ‌ని హెచ్చ‌రించారు. క‌లుషిత ఆహారం స‌ర‌ఫ‌రా చేసినా క‌ఠిన చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని చెప్పారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామ‌ని చెప్పారు.

 

ప్రజాప్రతినిధులు ఏ సన్న బియ్యం తింటున్నారో అవే బియ్యంతోనే గురుకుల విద్యార్థులకు భోజనం పెట్టాలనేది త‌మ ప్రభుత్వ సంకల్పమ‌ని చెప్పారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని ఆదేశించారు. విద్యార్థినుల‌కు స‌కాలంలో కాస్మొటిక్ ఛార్జీల‌ను చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్‌ చానల్‌ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. గురుకుల పాఠశాలలను తక్కువ అంచనా వేయొద్దని సీఎం స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం ఏ సన్న బియ్యం తింటున్నారో అవే బియ్యంతో గురుకుల విద్యార్థులకు భోజనం పెడ‌తామ‌ని తెలిపారు.

 

గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని సీఎం మండిప‌డ్డారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్‌ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని రేవంత్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్ర‌భుత్వ గురుకులాల్లో త‌ర‌చూ ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీంతో విద్యార్థులు అనారోగ్యం భారిన ప‌డుతూ ఆస్ప‌త్రి పాల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు, విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించేందుకు ప్ర‌భుత్వం న‌డుం బిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *