ఝార్ఖండ్ రాష్ట్రంలో రెండు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నవంబర్ 13న బుధవారం ప్రారంభమైంది. నవంబర్ 13 నుంచి నవంబర్ నవంబర్ 20 దాకా రెండు విడతల్లో జరుగుతున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశలో భాగంగా 15 జిల్లాలోని 43 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదివాసీ, దళిత జనాభా ఎక్కువగా ఉన్న ఝార్ఖండ్‌లో ఉదయం నుంచే ప్రజలు ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లలో క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటలకు 13.04 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సమాచారం.
నియోజకవర్గాల వారీగా చూస్తే.. అత్యధికంగా సిమ్‌డేగా జిల్లాలో 15 శాతం ఓటింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా ఉత్తర సింహభూమ్ జిల్లాలో 11.25 శాతం ఓటింగ్ జరిగిందని స్థానిక మీడియా రిపోర్ట్. ముఖ్యంగా ఆదివాసీ రిజర్వడ్ క్యాటగిరీ నియోజకవర్గాల్లో ఎక్కువ పోలింగ్ నమోదు అయింది. ఆ నియోజకవర్గాల్లో ప్రజలు తెల్లవారుఝామున 5 గంటల నుంచి క్యూలలో నిలబడ్డారు. పైగా ఓటర్లలో మహిళలు అధికంగా ఉండడం విశేషం. మరోవైపు రాంచీ, జమ్‌షెడ్‌పూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు ఓటర్లు ఆలస్యంగా వస్తున్నట్లు తెలిసింది.
తొలిదశ ఎన్నికల్లో ఝార్ఖండ్ లోని బడా నేతలు పోటీపడుతున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంపాయి సొరేన్, ఆయన కుమారుడు బాబూ లాల్ సొరేన్, మాజీ సిఎం అర్జున్ ముండా భార్య మీడా ముండా, సినీయర్ నాయకుడు మధు కోడా సతీమణి గీతా కోడా, రఘువీర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, మంత్రి మిథిలేఖ్ ఠాకుర్, మంత్రి రామేశ్వర్ ఉరావ్, రాంచీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిపి సింగ్, అధికరా పార్టీ జెఎమ్ఎమ్ కు చెందిన రాజ్యసభ సభ్యురాలు మహువా మాజీ ఈ రోజు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ సీట్లకు గాను 43 సీట్లలో నవంబర్ 13న ఓటింగ్ జరుగుతుండగా.. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న ఓటింగ్ జరుగనుంది.
గత ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలదే హవా
ఈ రోజు జరుగుతున్న 43 అసెంబ్లీ సీట్లపై 2019 లో జరిగిన ఎన్నికల్లో యుపిఎ కూటమి (ప్రస్తుత ఇండియా కూటమి) 29 సీట్లలో విజయం సాధించింది. మిగతా 14 సీట్లు.. బిజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీలు గెలుచుకున్నాయి. నవంబర్ 20న రెండో విడత లో 38 సీట్లకు ఓటింగ్ జరుగనుంది. ఈ 38 సీట్లలో కూడా యుపిఎ కూటమి పార్టీలు 22 సీట్లలో విజయం సాధించడం గమనార్హం.
ఝార్ఖండ్ లో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కొంత కాలం జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఆయన జైలులో ఉన్న సమయంలో పార్టీ తరుపున తాత్కాలిక సిఎంగా సీనియర్ నాయకుడు చంపయి సొరేన్ ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన తరువాత హేమంత్ సొరేన్ తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి చంపాయి సొరేన్ ని గద్దె దించారు. దీంతో చంపాయి సొరేన్, పార్టీ మధ్య విభేదాలు తలెత్తి ఆయన బిజేపీలో చేరారు.