మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. రెండు కూటముల నుంచి కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకరి పైన మరొకరు గురి పెడుతున్నారు. సామాజిక సమీకరణాలు .. ప్రాంతాల సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాతీయ నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. గ్రామీణ వాతావరణం ఉన్న చోట రాష్ట్ర స్థాయి నేతలు స్థానిక అంశాలతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సామిజిక లెక్కలే సమీకరణాలే కీలకంగా మారుతున్నాయి.
మారుతున్న లెక్కలు
మహారాష్ట్ర ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎంవీఏ, మహాయుతి కూటముల నేతలు అస్త్ర శస్త్రాలతో యుద్దంలో తల పడుతున్నారు. ఎంవీఏ కూటమికి మద్దతుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ముంబాయి వేదికగా తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గ్యారంటీలను వివరించారు. మహారాష్ట్రలో ఎంవీఏ గెలిస్తే సామాన్యులకు మేలు జరుగుతుందని ప్రచారం చేసారు. వారి ప్రచారాన్ని ప్రధాని మోదీతో సహా మహుయుతి కూటమి నేతలు తిప్పి కొట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఎంవీఏ నేతలు ఆరోపించారు. అటు మహాయుతి కూటమి నుంచి ఫడ్నవీస్ కూటమి సమన్వయ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీలో ఉండట.. అక్కడ ఈ సారి గట్టి పోటీ కొనసాగుతుండటంతో బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది.
The consolidation of Dalit and Muslim votes becomes crucial in Maharashtra Elections
ప్రధాని ప్రచారంతో
ప్రధాని మోదీ స్వయంగా ప్రచార బరిలోకి దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నేరుగా ఎంవీఏ నేతలను టార్గెట్ చేస్తున్నారు. సమాజంలో వర్గాలను చీల్చి రాజకీయంగా ప్రయోజనం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని మహారాష్ట్రలో ప్రతీ సభలో మోదీ ప్రస్తావిస్తున్నారు. మరఠ్వాడాలో రైతుల సమస్యలకు కాంగ్రెస్ గతంలో అనుసరించిన విధానాలే కారణమని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల తో ఓటింగ్ నష్టపోయారు. దీంతో, ప్రచారంలో ముఖ్య నేతలు ఆచి తూచి ప్రసంగాలు చేస్తున్నారు. స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వారి మద్దతు కోసం
మహారాష్ట్రలో దళిత, ముస్లిం మైనార్టీ ఓటర్ల మద్దతు ఈ సారి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో ఎంవీఏ కూటమి ఏకంగా 31 చోట్ల గెలిచింది. దీనికి ముస్లిం, దళిత ఓటింగ్ మద్దతే కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనూ ఆ ఓట్ బ్యాంక్ కాపాడుకోవటానికి ఎంవీఏ కూటమి నేతలు ప్రయ త్నాలు చేస్తున్నారు. కానీ, కనిపిస్తున్న మార్పును తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో మహారాష్ట్ర డెమెక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎంవీఏ కూటమికి అందుతున్న సహకారం కలిసొచ్చే అంశం. అయితే, మహాయుతి నేతలు సైతం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ముందుకు వెళ్తున్నారు. దీంతో, పోలింగ్ సమీపిస్తున్న వేళ గెలుపు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింతగా పెరుగుతోంది