తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో బహిష్కరణల పర్వం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ గ్రామస్తులు కుల గణన సర్వేను బహిష్కరిస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ సర్కార్ ముందు అనేక డిమాండ్లను కూడా పెడుతున్నారు.
ములుగు జిల్లాలోని గ్రామంలో సర్వే బహిష్కరణ
తాజాగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షెడ్యూల్డ్ తెగ గ్రామపంచాయతీకి చెందిన పలువురు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. తమ గ్రామానికి ఇప్పటివరకు తారు రోడ్డు నిర్మాణం జరగలేదని దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా తమ గ్రామం అభివృద్ధి చెందలేదని వారు ఆరోపించారు.
సర్వే బహిష్కరణకు కారణం ఇదే
గత ప్రస్తుత ప్రభుత్వాలు తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. గిరి వికాస పథకం ద్వారా బోర్లు వేసి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఆ బోర్లకు ఇప్పటివరకు కరెంటు కనెక్షన్స్ ఇవ్వలేకపోయామని, తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించే వరకు తాము సర్వేను బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు.
నిర్మల్ జిల్లాలోనూ సర్వే బహిష్కరణ
ఇక ములుగు జిల్లాలోని ఐలాపూర్ గ్రామం మాత్రమే కాదు, నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్, గుండంపెల్లి గ్రామాలలో ప్రజలు కూడా కులగణన సర్వేను బహిష్కరించారు. అక్కడ నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వారు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సర్వే ను ప్రారంభించడంతో వారు సర్వేను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేస్తేనే సర్వేకు సహకరిస్తామని వెల్లడి
తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేస్తేనే తమ గ్రామంలో సర్వే నిర్వహించాలని వారు చెబుతున్నారు. ఇక ఈ మేరకు తీర్మానం కూడా చేసి అక్కడ అధికారులకు అందజేశారు. అధికారులు కూడా ఏమీ చేయలేక అక్కడనుండి వెళ్ళిపోయారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో తమ గ్రామానికి సరిహద్దులు నిర్ణయించడంతోపాటు ఓటరు జాబితా తేల్చే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించబోమని వారు తెలిపారు.
గ్రామ సరిహద్దుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వే బహిష్కరణ
గొల్లపల్లి గ్రామం నుంచి కొత్తగా ఏర్పడిన వెంకట్రావుపల్లి సరిహద్దులను మార్చి కొత్త సరిహద్దులతో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని గ్రామస్తులకు తెలియకుండా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించేది లేదన్నారు. తమ గ్రామ సరిహద్దులను తేలిస్తేనే కుటుంబ సర్వేకు సహకరిస్తామని వారు పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించి రేవంత్ రెడ్డి ముందు కొత్త సమస్యలను పెడుతున్నారు.