అంత ధైర్యం లేకుంటే రాజీనామా చెయ్ జగనన్నా.. షర్మిళ కౌంటర్..

ఏంటమ్మా షర్మిళమ్మా.. అంత మాట అనేశారేంటీ.. ఒకేసారి రాజీనామా చేయాలని కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబమ్మా.. అంటూ పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ కి ఊతమిచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు వైఎస్ షర్మిళనే. ఇంతకు షర్మిళ అంతలా రియాక్ట్ ఎందుకయ్యారో తెలుసుకుందాం.

 

మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఇద్దరూ స్వయాన అన్నా చెల్లెలు. వైసీపీ కొత్తగా ఏర్పాటు చేసిన సమయంలో, జగన్ జైలుకెళ్లగా షర్మిళ కొద్ది రోజులు పార్టీ భాధ్యత కూడా తీసుకున్నారు. పాదయాత్ర కూడా చేశారు. తరువాత అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో, వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి.

 

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిళ కొనసాగుతుండగా, ఏపీలో ఎన్నికల అనంతరం ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ, కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇలాంటి స్థితిలో ఈ అన్నాచెల్లెలు మధ్య ఆస్తి తగాదాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా వీరి మధ్య విభేదాలు వార్తల్లో ఏదో ఒక రీతిన నిలుస్తున్నాయి.

 

తాజాగా మాజీ సీఎం జగన్ సోషల్ మీడియా వారియర్స్ అరెస్టులపై స్పందిస్తూ.. తనకు మైక్ ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేదని, అందుకు తాము అసెంబ్లీకి వెళ్లడం లేదంటూ కామెంట్స్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నట్లు జగన్ విమర్శించారు. ఈ కామెంట్స్ పై తాజాగా వైఎస్ షర్మిళ స్పందించారు.

 

షర్మిళ మాట్లాడుతూ.. అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలు అనవసరమని, అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేనప్పుడు మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సోషల్ మీడియా ట్రోలింగ్ కి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ట్రోలింగ్స్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని షర్మిళ, ప్రభుత్వాన్ని కోరారు.

 

అసలే ఆస్తుల వివాదంలో అన్నా చెల్లెలు మధ్య విభేదాలు బయటపడిన సందర్భంలో షర్మిళ కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏకంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంపై సాక్షాత్తు వైసీపీ నేతలు కూడా షాక్ కు గురయ్యారట. మరి ఈ కామెంట్స్ పై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *