కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఐదేళ్లు వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యం అయ్యాయో వివరించే ప్రయత్నం చేశారు. వ్యవస్థలో వంద శాతం అద్భుతంగా జరుగుతుందని ఎవరూ చెప్పరన్నారు.
లోపాలు ఉన్నమాట నిజమేనని, సీఎం చంద్రబాబు స్వయంగా ఆ మాటలు చెబుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. నాశనమైన వ్యవస్థలను ఏ విధంగా బాగు చేయాలనే దానిపై ముఖ్యమంత్రి ఒక్కోసారి ఓపెన్‌గా చెబుతున్నారని వెల్లడించారు.
గుంటూరు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి అధికారులతో రివ్యూ నిర్వహించారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, సూపరింటెండెంట్ రమణ హాజరయ్యారు. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్వహణ, జన ఔషధి మెడికల్ షాప్ ఏర్పాటు, ఈఎస్ఐ హాస్పిటల్ స్థల ఆక్రమణల తొలగింపు, ఇతర సేవల గురించి చర్చించారు.
సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు కేంద్రమంత్రి. జగన్ ప్రభుత్వంలో ఇసుక వ్యవహారాన్ని ప్రధానంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం 40 రీచ్‌లను కేటాయిస్తే.. 150 రీచ్‌ల్లో తవ్వకాలు చేసి, ఓ ప్యాకేజీ చేశారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కూటమి సర్కార్ ఉచితంగా ఇసుక ఇస్తోందన్నారు.
ఎమ్మెల్యేలు ఇసుక కబ్జాకు తెరలేపుతున్నారంటూ మీడియా ప్రశ్నలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చారాయన. నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలని అనుకుంటే అలా చేయవచ్చన్నారు. మళ్లీ, మళ్లీ గెలవాలని భావిస్తే.. అది ఎవరు చేసినా తప్పే అవుతుందన్నారు. ఇలాంటి వాటిని ఏ పార్టీ సమర్థించరన్నారు.
వ్యవస్థలను చూస్తుంటే అసహ్యం మేస్తోందన్నారు కేంద్రమంత్రి. నీతి నిజాయితీగా బతకాలి అనుకునేవారికి రాజకీయాలు ఎప్పుడో దూరమయ్యాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను వ్యవస్థలను బాగు చేసి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
వ్యవస్థలో ఉన్న చెడు పోతే అప్పుడు మంచి జరుగుతుందని, తద్వారా వ్యవస్థలు బాగుపడుతాయని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి. తాము గంటల తరబడి ఆసుపత్రిలో రివ్యూలు ప్రజల కోసం చేస్తున్నానని, అది పేద ప్రజలకు సంబంధించినది గుర్తు చేశారు.
ఎలక్షన్ అనేది పెద్ద ప్రాసెస్‌గా చెప్పుకొచ్చిన ఆయన, గత ఎన్నికల్లో తనకు ఎదురైన అనుభవాల్ని వివరించారు కేంద్రమంత్రి. తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చివర ఓ గ్రామానికి వెళ్తే మాకు దగ్గరకు డబ్బులు రాలేదని ప్రజలే అడుగుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు.
పచ్చిగా నిజాలు మాట్లాడాలంటే ఇలా ఉంటాయన్నారు సదరు మంత్రి. ఎన్నికలు వచ్చేసరికి గ్రామాల నాయకులు ఎమ్మెల్యేలను పీక్కుతింటే, ఎవర్ని అనాలనేది పెద్దగా సమస్యగా మారిందనన్నారు. మొత్తానికి గడిచిన ఐదేళ్లు వ్యవస్థలు ఏ విధంగా భ్రష్టు పట్టాయో కళ్లకు కట్టినట్టు వివరించారు కేంద్రమంత్రి.