లడఖ్ లో కీలక ప్రయోగం చేపట్టిన ఇస్రో.. సరికొత్త లక్ష్యాలకు సిద్ధమేనా..?

భవిష్యత్త్ అంతరిక్ష ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో – ISRO కీలక ప్రయోగాన్ని చేపట్టింది. లడఖ్ లోని లేహ్ లో తొలి అనలాగ్ స్పేస్ మిషన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. గ్రహాంతర పరిశోధనలు చేపడితే ఎదురయ్యే సవాళ్లను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన క్యాప్సుల్స్ తో ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. Hab-1 పేరున్న ఒక కాంపాక్ట్ క్రాఫ్ట్ మిషన్ లో ఈ పరిశోధనల్లో వినియోగిస్తుండగా.. గ్రహాంతర ఆవాసంలో జీవన పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేళ్లు నిండుతాయి. అప్పటి లోగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ఇస్రో భారత్ స్పేస్ విజన్- 2047 పేరుతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. దాని ప్రకారం.. 2035 నాటికి సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రం(BAS) ఏర్పాటు, 2040 నాటికి స్వదేశీ వ్యోమ నౌకలో చంద్రునిపై కాలుమొపడం లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. వాటితో పాటే… శుక్రయాన్ వంటి అనేక కార్యక్రమాలు జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రయోగాల సమయంలో ఎదురయ్యే సవాళ్లను తెలుసుకునేందుకు ప్రస్తుత ప్రయోగాన్ని చేపట్టారు.

 

సుదుర ప్రయోగాలప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోవడంతో పాటు.. రానున్న రోజుల్లో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రాఫ్ట్ లో హైడ్రోఫోనిక్స్ పంటలు పండించుకునే అవకాశంతో పాటు, వంటగది, శానిటేషన్ సౌకర్యాలను కల్పించారు. భారత్ భవిష్యత్ లో చంద్రుడు, అంగారక ప్రయోగాలతో పాటు మరిన్ని సుదీర్ఘ అంతరిక్ష యాత్రలను ప్లాన్ చేస్తున్న సమయంలో… ప్రస్తుత ప్రయోగంలో స్వీకరించే డేటాను వినియోగించుకుని.. ఇస్రో వ్యూహాలు సిద్దం చేయనుంది. ఈ మిషన్ ను హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఇస్రో (ISRO), AAKA స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, IIT బొంబాయి, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

 

లడఖ్ లోనే ప్రయోగాలు ఎందుకు..?

 

ఈ ప్రయోగానికి లడఖ్ ను ఎంచుకునేందుకు ప్రత్యేక కారణాలున్నాయన్న పరిశోధకులు.. అంగారక, చంద్రుడి వద్ద ఉండే ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఇక్కడ ఉండడంతో లడఖ్‌ను మిషన్ కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇక్కడి చల్లని, పొడి వాతావరణాలు, సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడం.. దీర్ఘకాల అంతరిక్ష మిషన్లకు అవసరమైన సాంకేతికతలు, వ్యూహాలను పరీక్షించేందుకు అనువైన ప్రదేశంగా గుర్తించినట్లు తెలుపుతున్నారు. ఈ ప్రయోగంలో నూతన టెక్నాలజీ, రోబోటిక్ పరికరాలు, అంతరిక్ష వాహనాల పనితీరు సహా.. ఆవాసాలు ఏర్పాటులో ఎదురయ్యే సవాళ్లు, కమ్యూనికేషన్ పనితీరును పరీక్షించనున్నారు. అలాగే.. ఈ అనలాగ్ మిషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, మొబిలిటీ, మౌలిక సదుపాయాలు, ఆహార నిల్వలు, ఇతర ఏర్పాట్లును పరిశీలించేందుకు ప్రయత్నించనున్నారు.

 

Hab-1 ప్రయోగం ద్వారా మానవ ఆరోగ్యం, శారీరక పనితీరుపై దృష్టి పెట్టనున్న శాస్త్రవేత్తలు.. ఐసోలేషన్, చాలా రోజుల పాటు నిర్భందంగా ఉండాల్సి రావడంతో ఆ ప్రభావాలను కూడా అధ్యయనం చేయనున్నారు. ఈ అనలాగ్ మిషన్ ఇతర గ్రహాలపై నివసించే సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అడుగు అంటూ ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *