ఏపీలో పైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరు తెచ్చుకున్న వాసిరెడ్డి పద్మ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినా, ఆ తర్వాత కూడా రాని గుర్తింపు వైసీపీలో ఆమెకు వచ్చింది. జగన్ ఆమెను ఏకంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించారు. ఓ దశలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు సైతం నోటీసులు జారీ చేయడం, ఆయనతో నేరుగా వాగ్వాదాలకు దిగిన చరిత్ర ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది.
ఎన్నికలకు ముందు టికెట్ ఆశించి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి గుడ్ బై చెప్పిన వాసిరెడ్డి పద్మను జగన్ కరుణించలేదు. దీంతో వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆమె.. తాజాగా పార్టీని వీడారు. జగన్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇవాళ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఓ రేప్ కేసు బాధితురాలి పేరు బయటపెట్టారంటూ విజయవాడ సీపీకి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీపై ఆమె నేరుగా పోరు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
దీంతో వాసిరెడ్డి పద్మ అధికార కూటమిలోని ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే రాజకీయపరమైన నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని ఇవాళ పద్మ తెలిపారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయని,
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులని వెల్లడించారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానన్నారు. అయితే ఆమె టీడీపీలోనే చేరబోతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కృష్ణాలోని జగ్గయ్యపేట సీటును గతంలో వాసిరెడ్డి పద్మ ఆశించారు. కానీ ఆమెకే కాదు తాజాగా వైసీపీ నుంచి జనసేనలో చేరిన సామినేని ఉదయభానుకు కూడా ఆ సీటు ఇవ్వలేమని కూటమి పార్టీల నేతలు తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో ఇదే జిల్లాలోని ఇంకేదైనా సీటు దొరుుకుతుందేమోనని వాసిరెడ్డి పద్మ ఎదురుచూస్తున్నారు. త్వరలో టీడీపీలో చేరనున్న పద్మకు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడే సీట్లలో ఏదో ఒకటి కేటాయించే అవకాశాలు ఉన్నాయి.