ఆల్‌టైం రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ..!

గణేష్ లడ్డూ వేలంపాటలో ఆల్‌టైం రికార్డు నమోదైంది. కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో గణేష్ లడ్డూ వేలం పాట జరిగింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో నిర్వహించిన గణేష్ వేలం పాటలో ఏకంగా రూ.1.87కోట్లు పలికింది.

 

ఇప్పటివరకు లక్షల్లో పలికిన గణేష్ లడ్డూ.. ఈసారి ఏకంగా రూ. కోటి 87లక్షలు దాటడం విశేషం. గతేడాది ఇక్కడ లడ్డూ ధర రూ.1.20కోట్లు పలికింది. గతేడాది కంటే ఈ సారి ఆ ధరను తలదన్నేలా వేలంపాట సాగింది. అయితే ఈ లడ్డూను దక్కించుకున్న భక్తుడి వివరాలు తెలియాల్సి ఉంది.

 

హైదరాబాద్‌లో మంగళవారం జరగనున్న నిమజ్జనానికి అధికారులు, పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 25వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 3వేల మంది హుస్సేన్ సాగర్‌లోనే సెక్యూరిటీ విధుల్లో ఉండనున్నారు.

 

సుమారు లక్ష విగ్రహాలను నిమజ్జనానికి తరలిరానున్న నేపథ్యంలో అందుకు సరిపడా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో 25వేల నుంచి 30వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

ఖైరతాబాద్ గణేషు విగ్రహాన్ని మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలాపూర్ వినాయకుడు హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలను, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నగరంలోనికి అనుమతి లేదు.

 

ఇదిలా ఉండగా, గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనుమడు రేయాన్ష్ రెడ్డి సందడి చేశారు. సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఇందులో రేయాన్ష్ బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా డాన్స్ చేశారు. అతడి స్టెప్పులు చూస్తూ సీఎం రేవంత్ మురిసిపోయారు. ఇక, సీఎం సతీమణి, కూతురు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *