ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. ఒక్క రోజులోనే 28 మంది మృతి..

ఉత్తర భారతదేశం అంతటా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. గత నెల రోజులుగా అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో ఈ వర్ష భీభత్సం మరింత ఎక్కువగా ఉంది. అక్కడ చాలా ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. ఇప్పటికే భారీ వర్షాలతో తాత్కాలికంగా అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. తిరిగి ప్రకటించేదాకా ఎవ్వరూ అమర్ నాథ్ కు బయలుదేరవద్దని అధికారులు చెబుతున్నారు.

 

డ్యామ్ కొట్టుకుపోయింది

 

హర్యానా రాష్ట్రంలో ప్రాజెక్టు డ్యామ్ కొట్టుకుపోయింది. దీనితో ఒక్కసారిగా వచ్చిన వరద నీటితో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వరద నీటిలో ముంపుకు గురయ్యాయి. పలువురు ప్రజలు నిరాశ్రయులయ్యారు. పంజాబ్ రాష్ట్రం హోషియార్ పూర్ లో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చిపడ్డాయి. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వరద నీటిలో చిక్కుకుని వాహనం మునిగిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. ఇక రాజస్థాన్ లో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర భారత దేశంలో ఒక్క రోజులోనే దాదాపు 28 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

 

హిమాచల్ లో 300 రహదారులు మూసివేత

 

ఢిల్లీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు ప్రాంతాలలో చెట్లు విరిగిపడ్డాయి. ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు ఓ పార్కు మునిగిపోయింది. పార్కులో చిక్కుకున్న ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. హిమాచల్ ప్రదేశ్ లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు మార్గాలు ముందు జాగ్రత్త చర్యగా అధికారులు మూసేశారు. దాదాపు 300కు పైగా రహదారులు మూతబడ్డాయి. అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడుతుండటంతో రహదారులు మూసివేసినట్లు హిమాచల్ ప్రదేశ్ అధికారులు చెబుతున్నారు. ఇంకా బీహార్, హర్యానా, అస్సాం, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ తో సహా ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా భారీ వర్షాలతో తల్లడిల్లిపోతున్నాయి.

 

రెండు రోజుల్లో 16 మంది మృతి

 

రాజస్థాన్ రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 16 మంది మృతి చెందారు. ఎంత నష్టం జరిగిందో, అంచనాలు వేయడానికి మరింత సమయం పడుతుందని పలు రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు అన్ని రాష్ట్రాలలో అధికంగా నమోదయినట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *