వారం రోజుల విదేశీ పర్యటనలలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 14న హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మొన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..వెంటనే విదేశీ పర్యటనలతో బిజీగా మారిపోయిన రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే మరోసారి బీఆర్ఎస్ వలసలపై దృష్టి సారించనున్నారు. కొన్ని సార్లు రావడం ఆలస్యం అవుతుందేమో గానీ రావడం పక్కా అని పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది. ఇప్పుడు రేవంత్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగారు. మిగిలిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే ఆ మధ్య వరసబెట్టి కాంగ్రెస్ కు క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు కొంత గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
భరోసా ఇస్తారా?
ఇప్పటిదాకా కాంగ్రెస్ కు వలస వెళ్లిన నేతలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎటువంటి లబ్ది చేకూరింది? ఇకపై చేరేవారికి ఎటువంటి లాభం చేకూరుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క..ఇకపై మరో లెక్క అన్నట్లు ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా తీసుకుని దీనిపై తీవ్రంగా కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి సంతృప్తి పరుద్దామా? లేక జిల్లాలవారీగా ఇన్ ఛార్జి పదవులు ఇచ్చి వారిని శాంత పరుద్దామా అనే ఆలోచన చేస్తున్నారని సమాచారం.
విదేశాలనుంచి రాగానే..
ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి స్పష్టమైన భరోసా లేనందున బీజేపీలో చేరితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డికి చేరవేశారు. దీనితో విదేశీ పర్యటన ముగియగానే ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై ఫోకస్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నారట. ఇప్పటికే కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బుజ్జగించి ఎలాగోలా కాంగ్రెస్ గూటికి చేర్చే బాధ్యతలు అప్పగించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులు కూడా ఇదే విషయంలో ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీళ్లందరికీ పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని కొందరు కాంగ్రెస్ లీడర్లు బహిర్గతమవుతున్నారు. అయితే అసంతృప్తులను కూడా ఎలాగోలా నచ్చజెప్పి పార్టీ మనుగడ కోసం త్యాగాలకు సైతం సిద్ధపడాలని సీనియర్లు వారిని బుజ్జగిస్తున్నారు.
శ్రావణ మాసం శుభ ఘడియలు
ఎలాగూ ఆషాఢం ముగిసింది. శ్రావణమాసం వచ్చేసింది. ఇక రాబోయే కాలమంతా శుభముహూర్తాలే. అందుకే వలస వద్దామనుకుంటున్న నేతలంతా ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్నారు. అదేదో స్పష్టమైన భరోసా తీసుకుని పార్టీలో చేరడం మంచిదని అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కీలక పదవులపై వీరికి భరోసా ఇస్తారని అనుకుంటున్నారు. బీజేపీలో చేరడానికి ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే శాపంగా మారుతున్నాయి. ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే వారు విధించే ఆంక్షలకు ఒప్పుకుంటేనే వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. పైగా ఎటువంటి పదవులూ ఆశించి మాత్రం మా పార్టీలోకి రాకండి అని వాళ్లే స్పష్టంగా చెబుతున్నారు.
భయపెడుతున్న టీడీపీ
ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ నేతలు కొందరు తెలుగుదేశం వైపు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు.