‘రుద్రమ సేన’ రంగప్రవేశం.. ఆడసింహాల్లా గర్జిద్దామన్న కవిత..!

మహిళలు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు జెండా ఎగిరేసేందుకు తాను సాయంగా ఉంటానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. మహిళలకు అవకాశాలు ఇచ్చేందుకే తాను పార్టీ పెట్టానన్నారు. “సంవిధాన్ దినోత్సవం” సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “మహిళలు- రాజ్యాంగం” అనే సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగం మాత్రమే అన్ని హక్కులు కల్పించిందన్నారు.

మహిళలకు పెన్షన్లు, బంగారం, సైకిళ్లు ఇస్తామని అబద్దాలు చెప్పటం కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. మహిళలకు బ్యాంక్ ఖాతాలు, ఉద్యోగాలు, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. మహిళలు ఎవరికీ భయపడకుండా తమ మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటూ రాజకీయాల్లోకి రావాలని కోరారు. మహిళలను మనుషులుగా గుర్తించింది భారత రాజ్యాంగం మాత్రమేనని.. ఆ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26 మనకు అసలు సిసలైన పండుగ రోజు అని చెప్పారు.

ప్రతి ఒక్క మహిళ తన ఇంట్లో మత గ్రంథంతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఉండేలా చూసుకోవాలని కోరారు. వేల ఏళ్లుగా మహిళలను ఒక వస్తువుగానో, ఆస్తిగానో చూశారని.. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాతే మహిళలను మనుషులుగా గుర్తించారని చెప్పారు. ఆడ, మగ అనే సంబంధం లేకుండా ఆడవాళ్లు కూడా మనుషులేనని వారికి కూడా మగవారితో సమానంగా ఓటు హక్కును కల్పించింది కూడా రాజ్యాంగమేనని చెప్పారు. రాజ్యాంగం మహిళలకే ఎక్కువ హక్కులు కల్పించిందని చెప్పారు.

కమ్యూనిస్టు పార్టీలు మహిళ హక్కుల గురించి పోరాటం చేస్తాయని భావిస్తామని.. కానీ ఆ పార్టీలో కూడా మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ నక్సల్స్ ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. మగవాళ్లతో సమానంగా తమను చూడాలని మాత్రమే కోరుతున్నామన్నారు. అవన్నీ జరగాలంటే మన రాజ్యాంగాన్ని యధాతథంగా అమలు చేస్తే చాలన్నారు. సాయుధ రైతాంగ పోరాటం సహా ఎన్నో పోరాటాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఫైట్ చేశారని కానీ మహిళల పోరాటాన్ని ఎక్కడ రాయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళ రాసిన పుస్తకం ద్వారా చాకలి ఐలమ్మ పోరాటం మనకు తెలిసిందని చెప్పారు. మన చరిత్ర మనమే చెప్పుకోవాలని.. లేదంటే చరిత్ర ఉండదని చరిత్ర మనకు చెబుతుందన్నారు. ‘మనం ఆడసింహాలం మన చరిత్రను మనమే రాసుకోవాల్సిన అవసరముంది’ అని కవిత న్నారు. తెలంగాణ రక్షణ సేన మహిళ విభాగం పేరును తెలంగాణ రుద్రమ సేనగా నామకరణం చేస్తున్నామని కవిత ప్రకటించారు. తెలంగాణ రుద్రమ సేన పోస్టర్ ను మహిళా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ మహిళ ఇన్ ఛార్జీలు ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.