అంచనాలు పెంచుతున్న చైతూ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ సినిమా ట్రైలర్..!

అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా, ‘విరూపాక్ష’తో సంచలన విజయం సాధించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వృషకర్మ’. మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై, విడుదలైన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.

ట్రైలర్‌ను పరిశీలిస్తే, సుమారు 5 వేల సంవత్సరాల క్రితం నాటి ఒక అతీంద్రియ శక్తి చుట్టూ కథనం అల్లినట్లు స్పష్టమవుతోంది. ‘అర్జున్’ అనే ట్రెజర్ హంటర్ పాత్రలో నాగ చైతన్య సాహసయాత్రతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. పురాతన గుహలలోని రహస్యాలను ఛేదించే క్రమంలో, వేద విజ్ఞానానికి సంబంధించిన ఓ నిగూఢ శక్తి బయటపడుతుంది. 

అయితే, ఆ శక్తి వల్ల మానవాళికి పెను ప్రమాదం ఏర్పడుతుంది. ఆ విపత్తును అడ్డుకుని, సృష్టి ధర్మాన్ని కాపాడేందుకు కథానాయకుడు ‘వృషకర్మ’ అనే దైవిక శక్తిగా అవతారం ఎత్తడమే ఈ కథలో అసలు మలుపు అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాగ చైతన్య మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటివరకు లవర్ బాయ్, క్లాస్ పాత్రల్లో మెప్పించిన ఆయన, తొలిసారి పూర్తి రఫ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన కష్టం తెరపై కనిపిస్తోంది. బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా తన విలక్షణమైన గెటప్స్, భయపెట్టే హావభావాలతో ట్రైలర్‌లో బలంగా ముద్ర వేశారు.

హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ‘దక్ష’ పాత్రలో, సీనియర్ నటుడు జయరామ్ ‘ప్రొఫెసర్ రంగనాథ్’ పాత్రలో కనిపించనున్నారు. ఉత్కంఠభరితమైన ఈ కథనంలో కమెడియన్ సత్య తన మార్క్ కామెడీతో ప్రేక్షకులకు రిలీఫ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ‘వృషకర్మ’ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.